స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బంది పై మంత్రి పొన్నం ఆగ్రహం ..! 16 h ago
TG : లంగర్హౌస్ ఇబ్రహీంబాగ్ లోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ సొసైటీ పాఠశాలను బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. ఇంట్లో మీరు తినే భోజనం ఇలాగే వండుకుంటారా? మీ పిల్లలకు ఇలాగే వండి పెడుతున్నారా? ఉడకని కూరగాయలకు తోడు అధికంగా మసాలాలు వేస్తే పిల్లల ఆరోగ్యాలు దెబ్బ తినవా? నాణ్యమైన భోజనం కోసం ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినా సరైన మెనూ అందివ్వడానికి మీకు వచ్చిన కష్టం ఏమిటి? అంటూ పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని మంత్రి పొన్నం నిలదీశారు. పిల్లల భోజనంపై ఇంత నిర్లక్ష్యమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు.
దుస్తులు, పాఠ్య పుస్తకాలు, ప్లేట్లు, ఇతర వస్తువులు సరిగా అందుతున్నాయా.. లేదా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బోధనపై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అన్నం వడ్డించారు. విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం సైతం భోజనం పెట్టించుకున్నారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, గోల్కొండ తహసీల్దార్ అహల్యతో పాటు ఇతర అధికారులను కూడా విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని తినాలని సూచించారు. ఈ క్రమంలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి పొన్నం.. కూరలు నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించి నిర్వాహకులపై మండిపడ్డారు. టమాటాలు ముక్కలు చేయకుండా.. కనీసం కోయకుండా అలా మసాలాలో నేరుగా వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం విషయంలో నాణ్యత పాటించకపోయినా.. నిర్లక్ష్యం వహించినా అందరూ బాధ్యులే అవుతారని ఆయన హెచ్చరించారు. వెంటనే మంచినీరు ఫిల్టర్‌కు మరమ్మతులు చేయించాలని, భోజనాలలో కూడా మార్పులు రాకపోతే ఒక్కరు తప్పు చేసినా అందరినీ బాధ్యుల్ని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.